చేతుల్లో తీజ్ మొలకలు.. ఒంటినిండా సంప్రదాయ ఆభరణాలు.. అడుగుల్లో లంబాడీ నృత్యం.. నోట సంప్రదాయ గీతాలు.. ఇలా నగరంలో ఆదివారం గిరిజన సంస్కృతి పరవళ్లు తొక్కింది.
బంజారా, లంబాడీ తెగల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే తీజ్ పండుగ ముగింపు వేడుకలు తీజ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజలకు శోభాయాత్రతో ముగింపు పలికారు.
కంటేశ్వర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో తొమ్మిది రోజులుగా తీజ్ ఉత్సవాలు కొనసాగాయి. లంబాడీ గిరిజనుల కులదేవతను కొలుస్తూ.. గోధుమ మొలకలను తీజ్‌గా పెంచి ప్రతిరోజూ పూజలు నిర్వహించారు.
ముఖ్యంగా పెళ్లికాని యువతులు ఈ వేడుకల్లో ప్రధాన పాత్ర పోషించారు. మొలకలను భక్తిశ్రద్ధలతో సంరక్షిస్తూ సంప్రదాయ పాటలు పాడారు. నృత్యాలు చేస్తూ తమ సంస్కృతిని చాటారు. తొమ్మిది రోజుల పాటు పూజించిన తీజ్ మొలకలకు చివరి రోజు వీడ్కోలు పలికారు.
కంటేశ్వర్ నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు తీజ్ మొలకలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్యాలు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
యువకులు, పెద్దలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చారు. అనంతరం తీజ్ మొలకలను నిమజ్జనం చేశారు.
గోధుమ మొలకల్లో ఓ నమ్మకం ‘తీజ్’ అంటే గోధుమ మొలకలు. శ్రావణ మాసంలో బంజారా, లంబాడీ సమాజం జరుపుకునే ఈ పండుగకు ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. మొలకలు ఏపుగా పెరిగితే మంచి పంటలు పండుతాయని, సమృద్ధి కలుగుతుందని నమ్ముతారు.
పెళ్లికాని యువతులు భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు తీజ్‌ను పూజించడం ఈ పండుగలో ప్రధాన సంప్రదాయం. మారుతున్న కాలంలోనూ.. మారని సంప్రదాయం కాలం మారుతోంది.. జీవన విధానం మారుతోంది.
అయినా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను మాత్రం గిరిజనులు కొనసాగిస్తున్నామనీ పోలీస్ కానిస్టేబుల్ మాన్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా తీజ్ వేడుకల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా తమ సంస్కృతి మూలాలను గుర్తు చేసుకుంటున్నామనీ అన్నారు.
