HomeLaw and Orderవిద్యార్థులు ‘డ్రీమ్‌ బిగ్‌’తో ముందుకెళ్లాలి క్రమశిక్షణ, సమయపాలనతో లక్ష్యాలను చేరుకోవాలి: సీపీ సాయి చైతన్య

విద్యార్థులు ‘డ్రీమ్‌ బిగ్‌’తో ముందుకెళ్లాలి క్రమశిక్షణ, సమయపాలనతో లక్ష్యాలను చేరుకోవాలి: సీపీ సాయి చైతన్య

విద్యార్థులు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే వరకు క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేయాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య సూచించారు. చదువుతో పాటు మంచి వ్యక్తిత్వం, నడవడిక, నైతిక విలువలను అలవర్చుకోవాలని అన్నారు.

ఆదివారం నగరంలోని అమ్మావెంచర్‌లోని ఎస్‌ఆర్‌కే ఫంక్షన్‌హాల్‌లో ఎంఎస్‌ఆర్‌ చారిటేబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన 130 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.13 లక్షల స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు ఆటంకం కలగకుండా విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించేందుకు ట్రస్ట్‌ అందిస్తున్న సహాయం అభినందనీయమని సీపీ పేర్కొన్నారు.

విద్యార్థులు ‘డ్రీమ్‌ బిగ్‌’ అనే సూత్రంతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. లక్ష్య సాధనకు సమయపాలన, క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్‌ ఫోన్ల ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉందని, వాటికి బానిస కాకుండా విద్య, విజ్ఞానం, అవసరమైన సమాచారానికే సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.

సమయాన్ని వృథా చేసే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. ఎంఎస్‌ఆర్‌ చారిటేబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు, నవీపేటకు చెందిన శివారెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామన్నారు.

ప్రస్తుతం తాము అందుకున్న సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో తమలాంటి అవసరం ఉన్న ఇతర విద్యార్థులకు సైతం సహాయం చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా తల్లిదండ్రులను, గురువులను మరువకూడదని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ కో-ఫౌండర్‌ శిరీష, టౌన్‌-4 ఎస్‌ఐ సాయన్న, ట్రస్ట్‌ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments