ఇళ్ల కింద బంగారం ఉందంటూ నమ్మించి మోసం.. నలుగురు అరెస్ట్
ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని, వాటిని బయటకు తీసి ఇస్తామని నమ్మించి అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి నిర్వహించిన దర్యాప్తులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
వారి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత నాణేలు, ఆరు కిలోల బొగ్గు, నాలుగు కిలోల మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మందిని మోసం చేసి దాదాపు రూ.కోటి వరకు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కె.ఎస్. రావు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్, తెలిపిన వివరాల ప్రకారం…. గుడిమల్కాపూర్‌కు చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా కార్ల డెంటింగ్, పెయింటింగ్ చేస్తుంటాడు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జవహర్‌నగర్ ఈసీఐఎల్ ఫర్హాన్నగర్కు చెందిన సయ్యద్ అలీ అష్రఫ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని బాలాజీనగర్‌కు చెందిన మహ్మద్ హాజీ (25) ఆటోడ్రైవర్‌గా, కీసర మండలం యాదగిరిపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ సల్మాన్ (29) బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు.
వీరంతా కలిసి సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు మునావర్‌పై గతంలో బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక చీటింగ్ కేసు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.
మునావర్ తనకు గుప్త నిధులను గుర్తించి బయటకు తీసే ప్రత్యేక శక్తులు, విద్య ఉన్నాయని ఇతరులను నమ్మించేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను ముఠాలో చేర్చుకున్నాడని చెప్పారు. నిందితులు అమాయకులను కలిసి వారి ఇళ్ల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారని తెలిపారు.
బాధితులు నమ్మిన తర్వాత వారు సూచించిన ప్రదేశంలో గుంత తీయించేవారు. ముందుగానే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని ఎవరికీ తెలియకుండా గుంతలో పాతిపెట్టేవారని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ పూజలు నిర్వహించి.. గుంతలో ఉన్న బొగ్గు కొంతకాలానికి బంగారంగా మారుతుందని బాధితులను నమ్మించేవారని చెప్పారు.
పూజల అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మందిని మోసం చేసి దాదాపు రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.
నిందితుల నుంచి రెండు నాలుగు చక్రాల వాహనాలు, ఒక ఆటోరిక్షా, రెండు మోటార్‌సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత నాణేలు, ఆరు కిలోల బొగ్గు, నాలుగు కిలోల మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026గా కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 318(4), 351(2), 61(2) రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుప్త నిధుల పేరుతో కొందరు కేటుగాళ్లు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ అమాయకులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇలాంటి వారి మాటలను నమ్మి డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.రవి, ఎస్ఐలు కె.మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్.శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
