మోర్తాడ్ నుంచి ఆర్మూర్ వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న దంపతులను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్పోర్ట్స్ బైక్‌పై వెంబడించి చైన్ స్నాచింగ్‌కు యత్నించిన ఘటన ఆర్మూర్ పెర్కిట్ సమీపంలో చోటుచేసుకుంది. మోర్తాడ్ నుంచి దంపతులు ఆర్మూర్ వైపు వస్తుండగా, ఇద్దరు దుండగులు స్పోర్ట్స్ బైక్‌పై వారిని వెంబడించినట్లు సమాచారం.
పెర్కిట్ సమీపానికి చేరుకున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన దుండగులు మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే మహిళ అప్రమత్తం కావడంతో వారి ప్రయత్నం విఫలమైంది. పుస్తెలతాడు తెగిపోకుండా, అందులోని పుస్తె మాత్రమే దుండగుల చేతికి చిక్కినట్లు తెలిసింది. అనంతరం వారు బైక్‌పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పెర్కిట్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనతో ఆర్మూర్ పరిసరాల్లో మరోసారి చైన్ స్నాచర్ల భయం నెలకొంది.
