ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో జుక్కల్ నియోజకవర్గానికి రానున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందులో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి జుక్కల్ నియోజకవర్గంలో ప్రైవేటు కార్యక్రమానికి తొలిసారిగా హాజరవుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఆహ్వానాలు పంపారు. దీంతో ఆయన హాజరవుతున్నారు.ఈమేరకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో కలిసి అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే సీఎం పర్యటన నేపథ్యంలో రెండు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులు కూడా వివాహ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉండటంతో బిచ్కుంద ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆయన వెళ్లే ప్రధాన మార్గాలు, కార్యక్రమం జరిగే ప్రాంతంలో అడుగడుగునా పోలీసులను మోహరించారు.ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందుకు భారీగా జనసమీకరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం కేవలం వివాహ వేడుకలో పాల్గొనేందుకే వస్తున్నప్పటికీ.. నియోజకవర్గానికి అభివృద్ధి వరాలు ప్రకటిస్తారన్న ఆశతో స్థానికులు ఎదురుచూస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాక కోసం బిచ్కుంద మండలం కందర్‌పల్లి వద్ద ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి సీఎం వివాహ వేడుక జరిగే ప్రాంతానికి వెళ్లే మార్గంలో భద్రతా చర్యలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
పెళ్లి వేడుక వేదికగా సీఎం ఏం మాట్లాడుతారు..నియోజకవర్గానికి ఏమైనా వరాలు ప్రకటిస్తారా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
