ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ యువతి దారుణ హత్యకు గురైన ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. 21 ఏళ్ల రేహానా, 21 ఏళ్ల అహ్మద్ అలియాస్ టోటా ఒకే ఫంక్షన్హాల్లో పనిచేస్తున్నారు.
గత ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు సమాచారం.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బక్రీద్ పండుగ సమయం నుంచి రేహానా బిస్మిల్లా కాలనీలో అహ్మద్‌తో కలిసి ఉంటున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రేహానా మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేందుకు అహ్మద్ ప్రయత్నించినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు అహ్మద్ అలియాస్ టోటాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు అసలు కారణం ఏమిటి వాగ్వాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
