నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు, రోడ్ల కబ్జాలు, మున్సిపల్ నిబంధనల ఉల్లంఘనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని 8వ డివిజన్ కార్పొరేటర్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ సెక్రటరీ మఠం పవన్‌కుమార్ జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డివిజన్‌లో కొంతమంది బిల్డర్లు, భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలు, రహదారులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రోడ్లపై అక్రమంగా ర్యాంపులు ఏర్పాటు చేయడంతో రహదారులు కుంచించుకుపోయి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
వర్షపు, మురుగునీరు వెళ్లేందుకు మార్గాలు లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దోమల బెడదతో ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు.మున్సిపల్ అనుమతులు ఒక రకంగా తీసుకుని.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు.
కొన్ని చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. గత నాలుగు నెలలుగా మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
స్థానికులు సైతం అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు నామమాత్రపు నోటీసులతో సరిపెడుతున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
రోడ్లపై ఏర్పాటు చేసిన అక్రమ ర్యాంపులను వెంటనే తొలగించాలని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలతోపాటు అనుమతి నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
