నాగులచవితి పర్వదినం, అందునా సోమవారం కావడంతో నిజామాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజామున నుంచే భక్తులు శివాలయాలకు తరలిరావడంతో ఆలయాలు భక్తజన సందోహంగా మారాయి. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. నగరంలోని కంఠేశ్వర్ నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడితో పాటు వివిధ శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నాగులచవితి సోమవారం రావడంతో శివుడిని దర్శించుకునేందుకు భక్తులు ప్రత్యేక ఆసక్తి చూపారు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లోని పుట్టల వద్ద మహిళలు సంప్రదాయబద్ధంగా నాగదేవతకు పూజలు చేశారు.
పసుపు, కుంకుమతో పుట్టలను అలంకరించి పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి, నాగదేవతకు మొక్కులు చెల్లించి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. నాగులచవితి సందర్భంగా ఆలయాలు, పుట్టల వద్ద భక్తుల సందడి కనిపించింది.
భక్తుల రద్దీతో పలు ఆలయాల పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరడంతో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
