కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఒక వర్గాన్ని సంతృప్తిపరిచేందుకు పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించకుండా అడ్డుకోవడం సరికాదని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్ అన్నారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం వందేమాతరం గీతాలాపనతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వంశీగౌడ్ మాట్లాడుతూ.. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం గీతం ప్రజల్లో స్ఫూర్తి నింపిందన్నారు. బంకించంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి భారతీయుడు దాని చరిత్రను తెలుసుకోవాలని సూచించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు వందేమాతరాన్ని ఆలపించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధీర్, చిరంజీవి, శశాంక్, శ్రావణ్, బీజేవైఎం నాయకులు విపుల్, ప్రశాంత్, రాజశేఖర్, మహేశ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
