తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అందించే గూగుల్ ఫామ్ లింక్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ నెల 23న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. నిజామాబాద్ డివిజన్ అభ్యర్థులకు మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో, ఆర్మూర్ డివిజన్ అభ్యర్థులకు క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో, బోధన్ డివిజన్ అభ్యర్థులకు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది.
రెండు నెలల శిక్షణ కాలంలో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహించడంతోపాటు అభ్యర్థులందరికీ ఉచిత స్టడీ మెటీరియల్ అందించనున్నారు.ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఉచితమని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్రాంతి 9951943656, 8712533273 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
