సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్–2 సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్‌లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సంఘం అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
బహుజన రాజ్యాధికార సాధన కోసం కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. పాపన్న గౌడ్ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో టీసీఎస్–2 శ్రీహరి గౌడ్, డైరెక్టర్లు బాలా గౌడ్, బసవ గౌడ్, గంగాధర్ గౌడ్, సిద్ధా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
