కాలనీ అవసరాల కోసం పార్కు ఏర్పాటుకు కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చంద్రశేఖర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపిస్తూ కాలనీ వాసులంతా కలిసి నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాలనీలో పిల్లల పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని యథావిధిగా ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
అలాగే స్థలాన్ని అధికారులు పరిశీలించి హద్దులు నిర్ధారించి, భవిష్యత్తులో కబ్జాలకు అవకాశం లేకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కాలనీ వాసుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.
ప్రభుత్వ భూముల ఆక్రమణపై సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లనున్నట్లు కాలనీ వాసులు తెలిపారు.
