రైలు గుట్టుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నిజామాబాద్ ఆర్‌పీఎఫ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్హెచ్ఓ స్వప్న తెలిపారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం. సాయి షిర్డీ రైలులో గంజాయి రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఆర్‌పీఎఫ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు గురువారం అర్ధరాత్రి సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.
రైలులో ఇద్దరు యువకులు తమ సీట్ల కింద రెండు సూట్‌కేసులను ఉంచుకుని ప్రయాణిస్తుండటాన్ని గమనించిన పోలీసులు అనుమానంతో వాటిని తనిఖీ చేశారు. సూట్‌కేసుల్లో 24.3 కిలోల ఎండు గంజాయి బయటపడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశా నుంచి షిర్డీకి గంజాయిని తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
షిర్డీలో ఓ వ్యక్తికి గంజాయి అప్పగించాల్సి ఉందని, ఇందుకు తమకు రూ.10 వేల చెల్లించినట్లు విచారణలో చెప్పినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిని ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన గణేష్ పోలి, దీపక్ సాహు గా గుర్తించారు.
వారి నుంచి 24.3 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ మల్లేశ్, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది శైలేష్, సలీం, దేవేందర్‌తో పాటు ఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
