కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడు రాసరి పెంటన్న డిమాండ్ చేశారు.
సెప్టెంబరు 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నాయకుడు, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు బహిరంగ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ నూతన పెన్షన్ విధానం రద్దు అంశాన్ని పొందుపరిచిందన్నారు.ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా హామీ అమలుకు ఇప్పటివరకు మంత్రుల సబ్‌కమిటీగానీ, అధికారుల అధ్యయన కమిటీగానీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు.
దేశంలోని పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర తదితర రాష్ట్రాలు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పాత పెన్షన్ విధానం అమలుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని రాసరి పెంటన్న కోరారు.
