హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫుల్ మారథాన్‌లో నిజామాబాద్ పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు మహిపాల్, సతీష్ సత్తా చాటారు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42.195 కి.మీ. మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మెడల్స్ అందుకున్నారు.
మహిపాల్ 5 గంటల 5 నిమిషాల 41 సెకన్లలో, సతీష్ 5 గంటల 55 నిమిషాల్లో పరుగును పూర్తి చేశారు.మెడల్స్ సాధించిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మంగళవారం అభినందించారు. విధులతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ పోలీస్ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు.
భవిష్యత్‌లో జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.కానిస్టేబుల్ పిల్లి మహిపాల్ ఇప్పటికే పది కంటే ఎక్కువ రన్నింగ్ ఈవెంట్లలో పాల్గొన్నారు. అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగే వేదాంత హాఫ్ మారథాన్‌లోనూ పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
సిబ్బంది కృషి, పట్టుదల ఇతర పోలీసులకు స్ఫూర్తిదాయకమని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంటీఓ శేఖర్‌బాబు పాల్గొన్నారు.
