ముగ్గురిపై కేసుఅక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారం బీట్ పరిధిలోని గుండారం చౌరస్తా వద్ద శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు తనిఖీలు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగుచూసింది.
అటవీశాఖ జిల్లా అధికారి ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న టేకు కలప విలువ రూ.73,210గా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కలప అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటోను కూడా సీజ్ చేశారు.
ఈ ఘటనపై నిజామాబాద్‌కు చెందిన అబ్రహర్ అలీ ఖాన్, మహమ్మద్ ముక్తార్, సద్దాం షేక్‌లపై కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అటవీ సంపదను అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని అటవీశాఖ అధికారులు తెలిపారు.
అటవీ సంపద పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. అక్రమంగా అటవీ ఉత్పత్తులను తరలిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సమీప అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
