నిషేధిత జాబితాలో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం లో ఎవరెవరున్నారనేది సర్వత్రా ఉత్కంఠ గా మారింది. బాధితుల సుదీర్ఘ పోరాటం నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసారు జస్ట్ ఇది ప్రాథమిక విచారనే ! పాత్రధారులు పేర్లు తెరమీదికి వచ్చాయి కానీ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లలో అసలు సూత్రదారులెవ్వరనేది దర్యాప్తు లో తేల్చు తారా లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ప్రజాప్రతినిదు లు బడా అధికారులు ప్రమేయం ఉన్న ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిగితే డొంక మొత్తం కదిలే ఛాన్స్ ఉంది. నిషేదిత భూములను గుట్టుగా పరాధీనం కావడం వెనుక ఎవరెవరు పావులు కదిపారనేది పోలీసులు తేల్చుతారా లేదా చూడలి లేదంటే అన్ని కేసుల్లాగే ఇది అటకెక్కుతుందా అనేది వేచి చూడాలి ! . నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్లపై అప్పటి జిల్లా రిజిస్ట్రార్ 2022 అక్టోబర్ 18న మెమో జారీ చేసినట్లు తెలిసింది.
ఆదేశాల ప్రకారం ఆయా భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాల్సి ఉన్నప్పటికీ, అదే ఏడాది నిజామాబాద్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఖుద్సియా బాదర్ ఏడుగురు వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేశారు.ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు ఓ డాక్యుమెంట్ రైటర్, మరో ఇద్దరు కార్యాలయ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది.
పత్రాల తయారీ నుంచి రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ఎవరు ఏ విధంగా వ్యవహరించారన్న అంశంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మాండా జయ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, రూ.40 వేలు ఇస్తామని చెప్పడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపినట్లు సమాచారం.
ఆమెను విచారించిన క్రమంలో మొత్తం ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ కేసులో మాండా జయతో పాటు అజ్వతుల్లాఖాన్‌ను పోలీసులు నెల రోజుల క్రితం అరెస్టు చేసినట్లు సమాచారం. మరో నలుగురు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.
తాజాగా సబ్‌రిజిస్ట్రార్ ఖుద్సియా బాదర్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సబ్‌రిజిస్ట్రార్ విచారణతో వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు కార్పొరేటర్లకు భూముల రిజిస్ట్రేషన్లతో ఉన్న సంబంధాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందితో వారి పరిచయాలు, డాక్యుమెంట్ రైటర్‌తో ఉన్న లింకులపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.
రిజిస్ట్రేషన్ల సమయంలో ఎవరెవరిని సంప్రదించారు, భూముల పత్రాల విషయంలో ఎవరి సూచనలు తీసుకున్నారు, కార్యాలయ సిబ్బందితో ఏ విధమైన సంబంధాలు కొనసాగాయన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కార్పొరేటర్లు ప్రస్తుతం అందుబాటులో పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి ఆచూకీ, ఈ వ్యవహారంలో వారి పాత్రకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
రిజిస్ట్రేషన్ సమయంలో విధుల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. వారి ప్రమేయానికి సంబంధించి ఆధారాలు లభిస్తే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిషేధిత జాబితాలో ఉన్న మరెన్ని భూములు ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ అయ్యాయన్న అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
సంబంధిత రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలిస్తూ, గతంలో జరిగిన లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
