గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని చాదర్ఘాట్ ఎస్హెచ్వో మురారి సూచించారు. శుక్రవారం మలక్పేట డివిజన్ పరిధిలోని మాపేట్ ఫంక్షన్ హాల్లో గణేశ్ మండపాల నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాదర్ఘాట్ ఎస్హెచ్వో మురారి మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, మతసామరస్యం, ప్రజా భద్రతకు విఘాతం కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
మండపాల వద్ద అత్యవసర మార్గాలు ఉండేలా చూడాలని, అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డీజేలు, సౌండ్ సిస్టమ్స్ విషయంలో అనుమతులు, నిర్ణీత సమయాలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలన్నారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు, తగిన వెలుతురు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రద్దీ నియంత్రణకు స్వచ్ఛంద కార్యకర్తలను నియమించుకోవాలని, అభ్యంతరకర, రెచ్చగొట్టే లేదా మతపరమైన విద్వేషాన్ని పెంచే అంశాలకు తావివ్వొద్దన్నారు.
అనుమానాస్పద కదలికలు లేదా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిమజ్జనం, ఊరేగింపుల సమయంలో పోలీసులకు, ఇతర శాఖలకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని ఎస్హెచ్వో మురారి తెలిపారు.
