కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భవానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా భవాని పురస్కారాన్ని స్వీకరించారు.
తెలంగాణ నుంచి ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకున్న ఏకైక మహిళగా ఆమె నిలిచారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా చేయడంతోపాటు వినూత్న బోధనా పద్ధతులను అనుసరిస్తూ భవాని ప్రత్యేక గుర్తింపు పొందారు. పుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ బోధనోపకరణాలు, సృజనాత్మక విధానాలను ఉపయోగిస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు ఆమె చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం.మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకోవడం పట్ల గాంధారి మండల ప్రజలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. భవాని సాధించిన ఈ ఘనత కామారెడ్డి జిల్లాకే కాకుండా తెలంగాణ విద్యారంగానికి గర్వకారణమని పలువురు అభినందించారు.
