మున్సిపల్ అధికారుల ఒత్తిడి భరించలేక ఓ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం నిజామాబాద్ నగరంలోని గోల్హనుమాన్ వద్ద చోటుచేసుకుంది. మున్సిపల్ డ్రైవర్ ఫయుం అధికారుల తీరుతో మనస్తాపానికి గురై వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళనకు దిగాడు.
విషయం తెలుసుకున్న తోటి కార్మికులు అక్కడికి చేరుకుని అతడిని సముదాయించి కిందికి దించారు. మున్సిపల్ అధికారులు కార్మికులను గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహించాలని, లేదంటే జీతాలు చెల్లించబోమంటూ ఒత్తిడి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు.
ఇప్పటికే విధుల విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, అధికారుల వేధింపులతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫయుం సోమవారం వాటర్ ట్యాంక్ ఎక్కడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కార్మికుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని, ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తోటి కార్మికులు డిమాండ్ చేశారు. ఘటనపై మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
