HomePOLITICAL NEWSUncategorizedఎస్ఐఆర్‌ నోటీసుల మోత! వయసు తేడాలు.. పేర్లలో పొరపాట్లు.. కుటుంబ సంబంధాల్లో వ్యత్యాసాలు

ఎస్ఐఆర్‌ నోటీసుల మోత! వయసు తేడాలు.. పేర్లలో పొరపాట్లు.. కుటుంబ సంబంధాల్లో వ్యత్యాసాలు

  • 1,09,639 నోటీసుల్లో 60,608 పంపిణీ.. ఇంకా 49,031 పెండింగ్‌
  • హియరింగ్‌ పూర్తయింది 17,939 మందికే.. 49,592 మందికి గడువు ముగింపు

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో నోటీసుల జారీ ఓటర్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య వయసు తేడాలు, పేర్లలో అక్షర దోషాలు, పుట్టిన తేదీల్లో వ్యత్యాసాలు, కుటుంబ సంబంధాల నమోదులో తప్పుల ఆధారంగా అనామలీస్‌ గుర్తిస్తున్నారు.

దీంతో చిన్నపాటి పొరపాట్లకు సైతం ఓటర్లు ధ్రువపత్రాలతో అధికారుల ఎదుట హాజరు కావాల్సి వస్తోంది.భార్యాభర్తల మధ్య వయసు తేడా తొమ్మిది నెలల కంటే తక్కువగా ఉన్నా అదనపు పరిశీలనకు సంబంధించిన కేసుగా పరిగణిస్తున్నారు.

తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా లేదా 50 ఏళ్లకు మించి ఉన్నా ఆధారాలు సమర్పించాలని సూచిస్తున్నారు. ఒకే పేరును తండ్రి పేరుగా నమోదు చేసిన సందర్భాల్లోనూ సవరణలు కోరుతూ నోటీసులు ఇస్తున్నారు. దీంతో అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలియక పలువురు ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.


గడువు దగ్గరపడుతున్నా.. నోటీసుల పంపిణీ నెమ్మదే!
జిల్లాలో మొత్తం 301 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. ఎస్ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా 1,09,639 నోటీసులు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 4,32,401 నోటీసులు జనరేట్‌ చేయగా.. 60,608 నోటీసులు పంపిణీ చేశారు.

ఇంకా 49,031 నోటీసులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 17,939 మంది హియరింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. మరో 49,592 మంది హియరింగ్‌ గడువు ముగిసిన జాబితాలో ఉన్నారు. నోటీసుల ప్రింటింగ్‌, పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

నోటీసు అందుకున్నవారికి నిర్ణయించిన రోజున ఇతర పనులు ఉండటం, సమాచారం సకాలంలో చేరకపోవడం వంటి కారణాలతో పలువురు హియరింగ్‌కు హాజరు కావడం లేదు. దీంతో మళ్లీ తేదీలు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ సమయంలో ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని కూడా వినియోగించిన అధికారులు.. ప్రస్తుతం నోటీసుల జారీ, హియరింగ్‌ ప్రక్రియను ప్రధానంగా బీఎల్‌వోలపైనే ఉంచారు.

నోటీసు జారీ చేయడం నుంచి ఓటరు సమర్పించే ఆధారాలు, హియరింగ్‌కు హాజరైన ఓటరు ఫొటోలను యాప్‌లో అప్లోడ్‌ చేయడం వరకు మొత్తం ప్రక్రియను బీఎల్‌వోలే నిర్వహించాల్సి వస్తోంది. ఒకవైపు ఇంటింటికీ తిరిగి నోటీసులు అందజేయడం.. మరోవైపు హియరింగ్‌కు వచ్చిన వారి వివరాలు, ధ్రువపత్రాలను నమోదు చేయడం..

అనంతరం యాప్‌లో అప్లోడ్‌ చేయడంతో పని భారం పెరిగింది. నిబంధనల్లో తరచూ మార్పులు రావడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది.


సెప్టెంబరు 16తో తెరపడనుందా?
నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాలు, ఆధారాల స్వీకరణకు సెప్టెంబరు 16 వరకు మాత్రమే గడువు ఉంది. ఈలోగా పెండింగ్‌లో ఉన్న 49,031 నోటీసుల పంపిణీ, హియరింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే హియరింగ్‌ గడువు ముగిసిన వారి సంఖ్య 49,592కు చేరడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.


ఎస్ఐఆర్‌ గణాంకాలు ఇలా..
మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 301
జారీ చేయాల్సిన నోటీసులు: 1,09,639
జనరేట్‌ చేసిన నోటీసులు: 4,32,401
పంపిణీ చేసిన నోటీసులు: 60,608
పంపిణీ చేయాల్సినవి: 49,031
హియరింగ్‌ పూర్తయిన వారు: 17,939
హియరింగ్‌ గడువు ముగిసిన వారు: 49,592
అభ్యంతరాల స్వీకరణకు గడువు: సెప్టెంబర్‌ 16 వరకు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments