పుట్టినరోజు నాడే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఎడపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. అంబం గ్రామానికి చెందిన కుర్మా సదానంద్ (23) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై జానకంపేట డీటీసీ శివారులోని చెట్టుకు ఉరివేసుకున్నాడు.
స్థానికుల కథనం ప్రకారం.. సదానంద్ ఇంట్లో తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం జానకంపేట డీటీసీ శివారుకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి సెల్ఫోన్ ఆధారంగా ఆచూకీ గుర్తించి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న సదానంద్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం. కాగా, బుధవారమే సదానంద్ పుట్టినరోజు కావడంతో ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
