విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్న ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. రాత్రివేళల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసి లోపలున్న కాపర్‌ను అపహరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరుసగా జరిగిన చోరీల వెనుక ఇదే ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి చోరీలకు ఉపయోగించిన వాహనం, పరికరాలు, 30 కిలోల కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర కేసు వివరాలను వెల్లడించారు.
గత ఐదు నెలలుగా భిక్కనూరు మండలంలోని బస్వాపూర్, భిక్కనూర్, గుర్జకుంట, రామేశ్వరపల్లి, జంగంపల్లి, ర్యాగట్లపల్లి గ్రామాల శివార్లలో ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్ చోరీకి గురయ్యాయి. రాజంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలపై ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ జాదవ్ బాలాజీ ఫిర్యాదు చేయడంతో భిక్కనూర్, రాజంపేట పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి అరెస్టు చేశారు.నిందితుల విచారణలో కామారెడ్డి జిల్లాలో 29, మెదక్ జిల్లాలో 23 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్ అపహరించినట్లు వెల్లడైంది.
మొత్తం 52 ట్రాన్స్‌ఫార్మర్ చోరీలతో పాటు ఒక హత్యాయత్నం, ఒక రాత్రి ఇంటి దొంగతనం కేసుల్లోనూ నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.రామేశ్వరపల్లి శివారులో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కాపర్ కాయిల్స్ తీసేందుకు ప్రయత్నిస్తున్న నిందితులను అసిస్టెంట్ లైన్‌మెన్ ప్రభాకర్ అడ్డుకున్నారు.
దీంతో ఆయనపై నిందితులు హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆయన ఫిర్యాదు మేరకు సెప్టెంబరు 9న భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుసగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంలో పోలీసులు చేపట్టిన దర్యాప్తు కీలకంగా మారింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఇతర కేసుల్లో వారి ప్రమేయంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
