- నిజాయితీగా పనిచేస్తున్న మిల్లర్లను ఇబ్బంది పెట్టొద్దు
- 8 నెలల మిల్లింగ్ ఛార్జీల బకాయిలు చెల్లించాలి.. క్వింటాల్‌కు రూ.150కు ఛార్జీ పెంచాలి
తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది నిజామాబాద్ డిస్ట్రిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రక్రియలో పెరిగిన పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీలు, హమాలీ ఖర్చులు తదితర భారాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిల్లుల నిర్వహణ కష్టంగా మారిందని, అందుకే మిల్లింగ్ ఛార్జీని క్వింటాల్‌కు రూ.150కు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఎనిమిది నెలలుగా తమకు రావాల్సిన మిల్లింగ్ ఛార్జీలు చెల్లించకపోవడంతో మిల్లర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.మిల్లులకు ధాన్యం కేటాయించిన మూడు నెలల్లోపు బియ్యాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధాన్యం ఎక్కువకాలం మిల్లుల్లో నిల్వ ఉండటం వల్ల నిల్వ, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. బాయిల్డ్ రైస్ రేషియో తేలకముందే కొత్త పంట ధాన్యాన్ని మిల్లులకు కేటాయించవద్దని కోరారు.ఎండకాలం పంటలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పచ్చి బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని మిల్లర్లు స్పష్టం చేశారు.
ఈ పరిస్థితుల్లో బాయిల్డ్ బియ్యం మాత్రమే ఇవ్వగలమని తెలిపారు. పంట నాణ్యత, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.సార్టెక్స్ రిజెక్షన్స్, నూకల కారణంగా ఏర్పడే తరుగు నష్టాన్ని లెక్కలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్లింగ్ ఒప్పందం ఇరుపక్షాలకు అనుకూలంగా ఉండేలా చూడాలని కోరారు.
ధాన్యం రేషియోకు సంబంధించిన అంశాలను స్పష్టంగా తేల్చిన తర్వాతే కొత్త పంట ధాన్యాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.1969 నాటి అభ్రి ధాన్యానికి సంబంధించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయించిన రేట్ల ప్రకారం బిల్లింగ్ చేసి, ఉన్న సమస్యలను సవరించాలని మిల్లర్లు కోరారు.
తమకు రావాల్సిన మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మిల్లర్ల భద్రత, రైతుల భవిష్యత్తు, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించాలని సంఘాల ప్రతినిధులు కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే మిల్లుల నిర్వహణ మరింత కష్టమవుతుందని స్పష్టం చేశారు.
