నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సతీష్ తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో మృతి చెందారు.ఈ ఘటన శుక్రవారం ఉదయం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. గురువారం రాత్రి నైట్ డ్యూటీ చేశాడు.
డ్యూటీ అనంతరం సతీష్ తన వద్ద ఉన్న సర్వీస్ వెపన్‌ను శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా తుపాకీ పేలినట్లు సమాచారం. బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మిస్‌ఫైర్ ఎలా జరిగిందన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, ఆయుధాన్ని శుభ్రం చేసే సమయంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణాల్లో వివరాలు పరిశీలిస్తున్నారు.
సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.
