నిజామాబాద్ క్రైమ్: గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను 24 గంటలపాటు మూసివేయనున్నారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ షాపులు, 2-బీ బార్లు, క్లబ్బులు తదితర మద్యం విక్రయ కేంద్రాలను మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు.
తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్-1968లోని సెక్షన్ 20(1) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ షాపులు, 2-బీ బార్లు, క్లబ్బులతో పాటు టి.డి.-1, టీఎస్‌బీసీఎల్ తదితరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు.
