చికిత్స బిల్లులో వాటా కోసం ఓ అంబులెన్స్ డ్రైవర్ దందా?చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే రోగికి ఆపద్బాంధవుడిగా నిలవాల్సిన ‘108’ అంబులెన్స్.. ఇప్పుడు కొందరి స్వార్థంతో కాసుల రికవరీ వ్యాపార కేంద్రంగా మారుతోంది.
క్షణాల వ్యవధిలో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, ప్రైవేటు ఆసుపత్రుల దళారులుగా మారుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమాయక ప్రజల బలహీనతను, అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకుంటూ సాగుతున్న ఈ ప్రాణాంతక దందాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్డు ప్రమాదమో, గుండెపోటో.. అత్యవసర సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండే బాధిత కుటుంబ సభ్యులకు ఆ సమయంలో అంబులెన్స్ డ్రైవర్ చెప్పిందే వేదవాక్యంగా మారుతుంది.ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు వైద్యులు ఎవరూ లేరు.. అక్కడికి తీసుకెళ్తే మీ రోగి కి సరైన వైద్యం అందక బతకడం కష్టం.. వెంటనే నేను చెప్పే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ భయపెట్టి ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రాణం నిలిస్తే చాలనుకునే అమాయక జనం ఆ డ్రైవర్ల మాటలను గుడ్డిగా నమ్మి అప్పులపాలై మరీ ప్రైవేటు ఆసుపత్రుల పాలవుతున్నారు.ఈ అంబులెన్స్ దందా అంతా తెరవెనుక పక్కా వ్యాపార సూత్రం ప్రకారమే నడుస్తోంది.
నిజామాబాద్ నగరంలోని పలు కీలక ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో కొందరు డ్రైవర్లు ముందస్తుగా రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అత్యవసర రోగిని తమ గడప తొక్కేలా చేస్తే చాలు.. ఆ ట్రీట్‌మెంట్ బిల్లులో ముట్టాల్సిన కమీషన్ ఎంతో ముందే సెట్ చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రోగి ఎక్కడికి వెళ్లాలి, ఏ వైద్యం అందాలనేది బాధితుల నిర్ణయం కావట్లేదు.. డ్రైవర్ల జేబులోకి వచ్చే కమీషన్ ఆధారంగా ఆ అంబులెన్స్ రూట్ మారుతుండటం అత్యంత విషాదకరం.ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇలా రోగులను తప్పుదారి పట్టించి ప్రైవేటుకు తరలిస్తున్న వైనంపై ఆరోగ్య శాఖ అధికారులకు పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ కొందరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఈ దందా మరింతగా సాగుతోందని కోడై కూస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ప్రాణాలను బజారుకీడుస్తున్న ఈ కక్కుర్తి డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
