HomeLaw and Orderకదం తొక్కిన బీడీ కార్మికులు* పీఎఫ్‌ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి..* 1,200 మంది కార్మికుల...

కదం తొక్కిన బీడీ కార్మికులు* పీఎఫ్‌ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి..* 1,200 మంది కార్మికుల ఆందోళన* ఆధార్‌–పీఎఫ్‌ వివరాల సవరణ.. కనీస పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలని డిమాండ్‌

పీఎఫ్‌ సమస్యల పరిష్కారం కోసం బీడీ కార్మికులు కదం తొక్కారు. తెలంగాణ ప్రగతిశీల బీడీవర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం సుమారు 1,200 మంది కార్మికులు నిజామాబాద్‌లోని పీఎఫ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా కార్యాలయం ఎదుట బైఠాయించారు. సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు. చివరకు అధికారులు వచ్చి కార్మికుల వినతిపత్రాన్ని స్వీకరించారు.

యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.ముత్తెన్న, కార్యదర్శి ఆర్‌.రమేష్‌ మాట్లాడుతూ.. ఆధార్‌, పీఎఫ్‌ రికార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీల్లో ఉన్న చిన్నపాటి తేడాల కారణంగా పలువురు బీడీ కార్మికులు పీఎఫ్‌ సొమ్ము, పెన్షన్‌ పొందలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఆధార్‌ కార్డులోని వివరాల ప్రకారం పీఎఫ్‌ రికార్డుల్లో తప్పులను సవరించే అవకాశం కల్పించాలని కోరారు. పీఎఫ్‌ వివరాల్లో మార్పుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు కనీస ఈపీఎఫ్‌ పెన్షన్‌ రూ.9 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

గతంలో కనీస పెన్షన్‌ పెంపుపై చర్చలు జరిగినా ఆశించిన ప్రయోజనం దక్కలేదన్నారు. ప్రస్తుతం హాజరు శాతం ఆధారంగా పెన్షన్‌ నిబంధనలు అమలు చేయడం వల్ల కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు. బీడీ పరిశ్రమలో నెలకు 5 నుంచి 10 రోజులు మాత్రమే పని లభిస్తున్న పరిస్థితుల్లో హాజరు నిబంధనతో పెన్షన్‌ అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

7, 8, 9 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు పీఎఫ్‌ సొమ్ము, పెన్షన్‌ ప్రయోజనాలు అందడం లేదని నాయకులు తెలిపారు. ఇటీవల పీఎఫ్‌లో చేసిన మార్పులు కూడా కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫారం 19, 10డీ దరఖాస్తులను 24 గంటల్లో పరిశీలించి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద సంఖ్యలో కార్మికులతో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వి.సత్తెవ్వ, కె.రాజేశ్వర్‌, ఏ.ప్రకాష్‌, జి.అరవింద్‌, ఎస్‌.కిషోర్‌, ఎం.డి.నజీర్‌, ఎస్‌.కె.సాధుల్లా, మటంల రాజవ్వ, ఎన్‌.కౌసల్య, జి.సువర్ణ, గౌండ్ల పద్మ, కె.పుష్ప, ఎన్‌.విజయ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments