HomeCRIMEమావోయిస్టు కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు..రూ.5 వేల జరిమానా.. నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం..

మావోయిస్టు కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు..రూ.5 వేల జరిమానా.. నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం..

నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్‌లోని నాలుగో అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి (మహిళా కోర్టు) డి.దుర్గ ప్రసాద్‌ సోమవారం తీర్పు వెలువరించారు.

నిందితుడికి రూ.5 వేల జరిమానా కూడా విధించారు. సిరికొండ మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన బూసా జనార్ధన్‌ అలియాస్‌ గొల్ల జనార్ధన్‌, తొంటి జనార్ధన్‌ (55)పై నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడినట్లు జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

2022లో జక్రాన్‌పల్లి ఎస్సైగా పనిచేసిన కె.శ్రీకాంత్‌ నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిజామాబాద్‌ డివిజన్‌ ఏసీపీలుగా పనిచేసిన ఎ.వెంకటేశ్వర్‌, ఎం.కిరణ్‌కుమార్‌, ఎల్‌.రాజా వెంకట్‌రెడ్డి దర్యాప్తు కొనసాగించారు.సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్‌ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది. 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.

కేసు దర్యాప్తు, విచారణలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీలు ఎ.వెంకటేశ్వర్‌, ఎం.కిరణ్‌కుమార్‌, ఎల్‌.రాజా వెంకట్‌రెడ్డి, ఏఎస్‌ఐ జి.నరేందర్‌, ఎస్సై కె.శ్రీకాంత్‌లను పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య అభినందించారు.

అలాగే సాక్షులను సకాలంలో న్యాయస్థానానికి హాజరుపరిచి ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.నీరజ, జక్రాన్‌పల్లి ఎస్సై జి.మహేశ్‌, కోర్టు లైజన్‌ అధికారి టి.గోవింద్‌, కానిస్టేబుళ్లు కె.చంద్రశేఖర్‌ (1824), కె.గణేశ్‌ (2535), ఈ.కిషోర్‌ (261)లను కూడా సీపీ ప్రశంసించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments