HomeTelanganaNizamabadరెడ్‌క్రాస్‌ ఎన్నికలకు రాజకీయ రంగు! సేవా సంస్థలో పాలకపీఠం కోసం రాజకీయ పావులు? ఐదేళ్ల...

రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు రాజకీయ రంగు! సేవా సంస్థలో పాలకపీఠం కోసం రాజకీయ పావులు? ఐదేళ్ల తర్వాత ఎన్నికలు..

  • రెండు ప్యానళ్లుగా 29 మంది బరిలో
  • 9,826 మంది సభ్యుల ఓటే కీలకం..
  • సేవా సంస్థలో పాగా కోసం ప్యానళ్ల మోహరింపు

సేవా కార్యక్రమాలకు వేదికైన రెడ్‌క్రాస్‌లో ఇప్పుడు పాలకపీఠం కోసం రాజకీయ పావులు కదులుతున్నాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు క్రమంగా రాజకీయ రంగు సంతరించుకుంటున్నాయి.

సంస్థను నడిపించే కమిటీలో చోటు కోసం అభ్యర్థులు ప్యానళ్లుగా జట్టు కట్టడం, వివిధ రాజకీయ, సామాజిక నేపథ్యాలున్న వ్యక్తులు బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు ప్యానళ్లుగా 29 మంది ప్రచారంలోకి దిగారు.

ఎవరి వెంట ఎంతమంది సభ్యులున్నారన్న లెక్కలతోపాటు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక సమీకరణాలు వేగం పుంజుకున్నాయి. రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు సెప్టెంబరు 24న నోటిఫికేషన్‌ విడుదలైంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది.

మొత్తం 29 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. దీంతో మొత్తం 29 మంది బరిలో కొనసాగుతున్నారు. వీరంతా రెండు ప్యానళ్లుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కమిటీలో పనిచేసిన కొందరు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 9,826 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో ఓటు కీలకం కావడంతో అభ్యర్థులు సభ్యుల మద్దతు కూడగట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్యానళ్ల పేర్లతో ప్రచారం సాగుతోంది. సభ్యులను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరడంతోపాటు తమ ప్యానల్‌ బలాబలాలను వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

రెడ్‌క్రాస్‌ ఎన్నికల్లో ఈసారి ప్యానళ్ల ఏర్పాటు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ రాజకీయ వర్గాలతో అనుబంధం ఉన్నవారితోపాటు బీజేపీ, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్నవారూ బరిలో ఉన్నట్లు అభ్యర్థుల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దీంతో సేవా సంస్థ ఎన్నికలకు రాజకీయ సమీకరణాల ప్రభావం ఎంతమేర ఉంటుందన్న చర్చ సభ్యుల్లో సాగుతోంది. తమకు అనుకూలమైన ఓటర్ల సమీకరణాలను బలోపేతం చేసుకునేందుకు ప్యానళ్లు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.

4న పోలింగ్‌.. అదే రోజు ఫలితాలు

అక్టోబరు 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ బస్టాండ్‌ సమీపంలోని హరిచరణ్‌ పాఠశాలలో 20 పోలింగ్‌కు కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.

అనంతరం విజేతలకు నియామక పత్రాలు అందజేస్తారు. ఎన్నికైన కమిటీ మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనుంది. జిల్లా సహకార అధికారి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్యానళ్ల మధ్య సమీకరణాలు మరింత వేడెక్కే అవకాశముంది.

సభ్యుల మద్దతును కూడగట్టడమే లక్ష్యంగా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్యానళ్ల బలాబలాలపై లెక్కలు మొదలయ్యాయి. చివరకు 9,826 మంది సభ్యుల తీర్పు ఎవరి చేతికి రెడ్‌క్రాస్‌ కమిటీ పగ్గాలు అందిస్తుందన్నది అక్టోబరు 4న తేలనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments