అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను, ఆయన అనుసరించిన సిద్ధాంతాలను స్మరించుకున్నారు.సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను తన జీవితంలో ఆచరించి, వాటి శక్తిని ప్రపంచానికి చాటిన మహాత్మా గాంధీ జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందని అన్నారు.గాంధీజీ కలలు కన్న సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, శాంతి, సౌభ్రాతృత్వం వంటి విలువలకు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు.
ఆయన ఆశయాలను నేటి తరానికి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, పేదలు, బలహీనవర్గాలు, అణగారిన ప్రజల సంక్షేమానికి కృషి చేయడమే గాంధీజీకి నిజమైన నివాళి అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీజీ సత్యం, అహింస సిద్ధాంతాలను జీవితంలో ఆచరించి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు.
