మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దాచిపెట్టిన కేసులో నిందితుడు గైక్వాడ్ సూర్యకాంత్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి ఆదేశించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.2025 ఏప్రిల్ 6న నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్‌లో మూడేళ్ల బాలిక అదృశ్యమైంది.
గాంధీ విగ్రహం వద్ద బాలికను తన తల్లితో ఉంచి తల్లి శిరీష భిక్షాటనకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించకపోవడంతో నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా బాలికను గైక్వాడ్ సోదరులు కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు.
మద్నూర్ మండలం సలాబాత్‌పూర్‌కు చెందిన గైక్వాడ్ బాలాజీ, సూర్యకాంత్ కూలీ పనులు చేసేవారు. బాలలను కిడ్నాప్ చేసి విక్రయిస్తే డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో బాలాజీ తన తమ్ముడు సూర్యకాంత్‌తో కలిసి నిజామాబాద్‌కు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
బాలికను కిడ్నాప్ చేసిన బాలాజీ, ఆమెను సలాబాత్‌పూర్‌కు తీసుకెళ్లి సూర్యకాంత్‌కు అప్పగించినట్లు విచారణలో తేలింది.పోలీసులు గాలింపు చేపట్టి సూర్యకాంత్‌ను అరెస్టు చేశారు. బాలికను విక్రయించేందుకు ప్రయత్నించేలోపే పోలీసులు పట్టుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అనంతరం దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల వాంగ్మూలాలు, పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం సూర్యకాంత్ బాలికను దాచిపెట్టి ప్రధాన నిందితుడికి సహకరించినట్లు నిర్ధారించి శిక్ష విధించింది.
కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన టౌన్-1 సీఐ, ఎస్‌హెచ్‌వో రఘుపతి, ఎస్‌ఐలు మొగులయ్య, బాల్‌సింగ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రాజేశ్వర్‌రెడ్డి, కోర్టు లైజన్ అధికారి టి.గోవింద్, బ్రీఫింగ్ ఆఫీసర్, కోర్టు సీఎంఎస్, సీడీవో సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐపీఎస్ అభినందించారు.
