ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మానవత్వం.. మరణించిన తర్వాత కూడా కొనసాగింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న రెండు అనాథ మృతదేహాలకు ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.నగరంలోని దేవి థియేటర్ సమీపంలోని సార్వజనిక శ్మశానవాటికలో ఐదు రోజులుగా రెండు మృతదేహాలు ఉండిపోయాయి.
కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లడంతోపాటు.. మృతుల వివరాలు తెలియని పరిస్థితి నెలకొంది. నందిపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు, త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో మరొకరు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తిచేసినప్పటికీ అంతిమ సంస్కారాలకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థను సంప్రదించారు.
స్పందించిన సంస్థ సభ్యులు శ్మశానవాటికకు చేరుకుని రెండు మృతదేహాలకు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమకు ఎలాంటి సంబంధం లేని వారైనా.. చివరి మజిలీలో గౌరవంగా సాగనంపడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మద్దుకురి సాయిబాబు, రాజశేఖర్, అఫ్రోజ్, యువి ఫౌండేషన్ ప్రతినిధి స్వస్తిక్, నందిపేట ఏఎస్సై వెంకటేష్, త్రీటౌన్ పోలీస్ సిబ్బంది నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
