HomeTelanganaNizamabadబధిరుల పట్ల మానవీయంగా వ్యవహరించాలి..విద్యార్థులతో ముఖాముఖిలో సీపీ సాయి చైతన్య

బధిరుల పట్ల మానవీయంగా వ్యవహరించాలి..విద్యార్థులతో ముఖాముఖిలో సీపీ సాయి చైతన్య

బధిరులు, దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పోలీస్‌స్టేషన్లకు వచ్చినప్పుడు వారి ఇబ్బందులను సానుభూతితో అర్థం చేసుకొని, అవసరమైన సహకారం అందించాలని పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య సూచించారు.

వారితో గౌరవప్రదంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.టౌన్‌-4 పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రేసీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంటల్‌ సర్వీసెస్‌లో శుక్రవారం బధిర విద్యార్థులతో సీపీ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంలో పోలీసుల పాత్రపై సిబ్బందికి అవగాహన కల్పించారు. వినికిడి లోపం ఉన్నవారు తమ సమస్యలను మాటల ద్వారా తెలియజేయలేని పరిస్థితుల్లో వారితో ఎలా సంభాషించాలి.. వారి ఇబ్బందులను ఎలా తెలుసుకోవాలనే అంశాలను వివరించారు.

బధిరులు, దివ్యాంగులు పోలీసులను ఆశ్రయించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని సీపీ సూచించారు. అవసరమైన చోట సంజ్ఞా భాష తెలిసిన వ్యక్తుల సహకారం తీసుకొని బాధితులు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునేలా అనుకూల వాతావరణం కల్పించాలన్నారు.

పోలీసుశాఖ ప్రజలందరికీ సమానంగా సేవలందించాలని, దివ్యాంగుల విషయంలో మరింత సహనం, సానుభూతి, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్కులు, దుస్తులను సీపీ అందజేశారు. వారితో ఆత్మీయంగా మెలుగుతూ స్వయంగా భోజనం వడ్డించారు.

విద్యార్థులతో కలిసి కొంతసేపు గడిపారు. దివ్యాంగుల సమస్యలపై పోలీసు సిబ్బందికి అవగాహన పెంచడంతో పాటు వారిలో భద్రతాభావాన్ని కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్‌) శుభం ప్రకాశ్‌, నిజామాబాద్‌ ఏసీపీ ప్రకాశ్‌, సీసీఆర్‌ ఏసీపీ గురు నాయుడు, సీఐలు, ఎస్‌ఐలు, గ్రేసీ ఆర్గనైజేషన్‌ అధ్యక్షురాలు ఆర్‌. శోభారాణి, జనరల్‌ సెక్రటరీ, వైస్‌ సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments