ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై, భారీగా అప్పులుపాలైన ఓ యువకుడు తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారం గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లికొండ రఘు (29) కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు.
ఈ క్రమంలోనే బెట్టింగ్‌లో పెద్దఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. వచ్చిన డబ్బులన్నీ పోవడంతో పాటు ఇతరుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది.చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
జీవితంపై విరక్తి చెందిన రఘు శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుమలత సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన యువకుడు ఇలా ఆన్‌లైన్ వ్యసనానికి బలై ప్రాణాలు తీసుకోవడంతో గౌరారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువత ఇలాంటి మోసపూరిత బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
