నిందితుడి అరెస్టుతనను దూరం పెడుతోందన్న కోపంతో ఓ మహిళను కత్తితో పొడిచి హత్య చేసిన వ్యక్తిని చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. అజాంపూరాలోని మన్హా లగ్జరియస్ ఉమెన్స్ స్టోర్‌లో సేల్స్‌వుమన్‌గా పనిచేస్తున్న తాహెరా బానుపై అదే దుకాణంలో గతంలో పనిచేసిన మహ్మద్ ఇబ్రహీం ఈ దాడికి పాల్పడ్డాడు.
తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.చాదర్‌ఘాట్ ఎస్ హెచ్ ఓ మురారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న రాత్రి 9.30 గంటల సమయంలో తాహెరా బానుపై ఇబ్రహీం పదునైన కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటలకు మృతి చెందింది.
ఆమె భర్త మహ్మద్ ఖాజా మొయిన్ ఉద్దీన్ (అలియాస్ అన్నూ) ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాహెరా బానుతో ఇబ్రహీంకు గత కొన్నేళ్లుగా సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత ఆరు నెలలుగా ఆమె అతడిని దూరం పెడుతూ, అతడి ప్రయత్నాలకు స్పందించడం లేదని పోలీసులు తెలిపారు.
దీంతో ఆమెపై కోపం, అసహనం పెంచుకున్న ఇబ్రహీం.. చివరకు హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఇబ్రహీం (35)ను ఈ నెల 11న అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
