నిజామాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ శివారు ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతోంది. ఇదే అదనుగా ప్రభుత్వ భూములపై కొందరు కన్నేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చెరువులు, పంట కాల్వలకు సంబంధించిన భూములు క్రమంగా కనుమరుగవుతుండగా.. వాటి ఆనవాళ్లు కనిపించకుండా ప్రహరీలు, నిర్మాణాలు వెలుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఉన్న నగరంలోని 14వ డివిజన్ అర్సపల్లి లో చెరువును ఆనుకుని ఉన్న భూమి ఆక్రమణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అరసపల్లిలో చెరువును ఆనుకుని ఉన్న భూమిని కొందరు రాజకీయ నేతలు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి, గేట్లు సైతం ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమి అయితే దాని హద్దులు ఎవరు నిర్ణయించారు? ప్రహరీ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న అర్సపల్లి శిఖం భూములు సైతం అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగర శివారులో విలువైన భూములపై ఆక్రమణల ఆరోపణలు తరచూ తెరపైకి వస్తున్నా.. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చెరువుల భూములు కబ్జాకు గురైతే భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతోపాటు జలవనరుల ఉనికికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.
అర్సపల్లి లోని స్థలంపై రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. చెరువు హద్దులను నిర్ధారించి, ఆక్రమణ జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న ఆరోపణలపై అధికారులు స్పందించి, రికార్డుల ఆధారంగా వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. చెరువుల భూములను కాపాడాల్సిన యంత్రాంగం.. ఆక్రమణల ఆరోపణల నిగ్గు తేల్చి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పిస్తుందా? అన్నది వేచి చూడాలి.
