భద్రతా ఏర్పాట్లపై నాయకుల అసంతృప్తితెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడం మెదక్ పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని వెల్‌కమ్ బోర్డు సమీపంలో ఉన్న విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు మంగళవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.
విషయం తెలుసుకున్న రజక సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విగ్రహం వద్ద నిఘా వ్యవస్థ సక్రమంగా లేకపోవడంపై సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు విగ్రహం వైపు స్పష్టంగా ఉండేలా అమర్చలేదని, అందుబాటులో ఉన్న కెమెరాల ద్వారా నిందితులను గుర్తించడం సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తం చేశారు.
ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, ఆమె విగ్రహానికి తగిన రక్షణ కల్పించడంలో ఎందుకు శ్రద్ధ చూపలేదని ప్రశ్నించారు.విగ్రహం ధ్వంసంపై మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఈ చర్యను ఖండిస్తూ, బాధ్యులను వెంటనే గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. ధ్వంసమైన విగ్రహాన్ని ఆలస్యం చేయకుండా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఘటన గురించి తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు కూడా విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న సంఘాల ప్రతినిధులకు సంఘీభావం ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
