- తెల్లవారుజామున 5.30 గంటలకే రంగంలోకి నాలుగు శాఖలు
- సర్వే నంబర్ 216 సమీపంలో తొలగింపు..
- రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసు శాఖల సంయుక్త చర్యలు
నగరం లోని చెరువు శిఖం భూమిలో ఆక్రమణపై ఇదీ సంగతి పత్రికలో వెలువడిన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. ఈ కథనం మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి వెంటనే నిజామాబాద్ ఉత్తర మండలం అర్సపల్లిలోని రామూర్తి చెరువు శిఖం భూమిలో నిర్మించిన టీన్షెడ్ను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు.
ఈమేరకు ఆర్డీవో రాజేంద్రకుమార్, ఉత్తర మండలం ఎమ్మార్వో ఆధ్వర్యంలో సర్వే నంబర్ 216 సమీపంలోని ఆక్రమణను తొలగించేందుకు శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకే రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసు శాఖల సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగారు.
చెరువు భూముల పరిరక్షణపై “చెరువు భూములపై కన్నేసిన కబ్జా రాయుళ్లు” అనే వచ్చిన కథనంతో కదిలిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువుల పరిధిలోని శిఖం భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.
ఈ నేపథ్యంలో అర్సపల్లిలో రామూర్తి చెరువు శిఖం భూమిని ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్ను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేసి తెల్లవారుజామున కూల్చివేత చేపట్టారు.
సర్వే నంబర్ 216 సమీపంలోని షెడ్ను తొలగించి ఆక్రమణను నిర్మూలించారు. కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు భూమికి సంబంధించిన వివరాలను పర్యవేక్షించగా, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ శాఖల సిబ్బంది తొలగింపు చర్యల్లో పాల్గొన్నారు.
ఉత్తర మండల తహసీల్దార్ హరికిషోర్ శర్మ, డిప్యూటీ తహసీల్దార్ అనిల్, రెవెన్యూ అధికారులు, ఆర్ఐలు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రదీప్, ఇరిగేషన్, పోలీసు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువుల శిఖం భూములు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కేవలం కూల్చివేతలకే పరిమితం కాకూడదు.
ఆక్రమణలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడం, ఇప్పటికే ఆక్రమణకు గురైన భూములను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం కీలకం. హర్సపల్లిలో చేపట్టిన చర్యతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ చెరువు భూములపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇదీ సంగతి కథనానికి స్పందించి అధికారులు చర్యలు చేపట్టడం ఆక్రమణల సమస్యపై యంత్రాంగం కదలికకు నిదర్శనంగా నిలిచింది.
