దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.
సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందిన తర్వాతే దుకాణాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం–1884, సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.టపాకాయల దుకాణాలను నిర్దేశిత ఖాళీ ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలి.
ఆ స్థలానికి సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తప్పనిసరిగా పొందాలి. ఒక క్లస్టర్‌లో 50 దుకాణాలకు మించి ఏర్పాటు చేయకూడదు. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు కల్యాణ మండపాలు, సమావేశ కేంద్రాల్లో టపాకాయల దుకాణాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
దుకాణాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత ఏసీపీ కార్యాలయంలో సమర్పించాలని పోలీస్ కమిషనరేట్ అధికారులు సూచించారు.
