నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి పెరిగినప్పటికీ వైద్య పరీక్షలకు సంబంధించిన సేవలు మెరుగుపడటం లేదు. నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా గత కొన్ని రోజులుగా రక్త పరీక్షల్లో అత్యంత కీలకమైన మలేరియా, చికెన్ గున్యా పరీక్షలు నిలిచిపోయాయి.
కొన్ని విభాగాల్లో మందుల కొరత వేధిస్తోంది. సంబంధిత పరీక్షలు నిలిచిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.అసలే సీజనల్ వ్యాధుల కాలం.
తీవ్ర జ్వరంతో జనం మంచాన పడుతున్నారు. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా ఇతర సీజనల్ వ్యాధులతో ప్లేట్ లేట్స్ కూడా తగ్గిపోతున్నాయి.
రక్తంలో ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యాధిని గుర్తించడంతో ఇన్‌ఫెక్షన్ ఎంత ఉందో తెలుసుకునేందుకు ముందుగా చేసేది రక్తపరీక్ష. దీంతో పాటు మరికొన్ని రక్తపరీక్షలు కూడా చేస్తారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు సుమారు 2000 వరకు అవుట్ పేషంట్ వస్తున్నారు. అలాగే రిపోర్టులు ఆలస్యంగా ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉదయం డాక్టర్లు పరీక్షలు రాసి రోగికి ఇస్తున్నారు. రోగి ల్యాబ్‌లో రక్తనమూనాలు ఇస్తున్నారు. కానీ రిపోర్టులు మాత్రం మరుసటి రోజు వస్తున్నాయి. దీనిని బట్టి ఒక రోగి రిపోర్టుల కోసం మరో రోజు కూడా రావలసి వస్తుంది.
దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి కారణాల వలన రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే భయపడుతున్నారు.
మందుల కొరత … సర్కారు దవాఖానాలో చికిత్స కోసం వచ్చే నిరుపేద రోగులకు మందుల కొనుగోలు పెను భారంగా మారుతోందని, ట్రీట్ మెంట్ వరకు ఉచితంగానే అందుతున్నా,ఔషధాలు మాత్రం పూర్తి స్థాయిలో దొరకడం లేదని అంటున్నారు.
సర్కారు నుంచి పలు రకాల మందుల సరఫరా కొద్దిరోజులుగా నిలిచిపోయింది. ముఖ్యంగా బీపీ, షుగర్, గ్యాస్, జలుబు, దగ్గు గోలీలు దొరుకడం లేదు. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక ప్రైవేట్‌లో కొనుగోలు చేస్తున్నారు.
