నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి శుక్రవారం కేంద్ర రోడ్డు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదనలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, నాందేవాడ అదనపు వంతెన ( ఆర్ వో బీ ) మంజూరుచేయాలని కోరడం జరిగిందన్నారు. అలాగే సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎల్లమ్మ గుట్ట వద్ద ఆర్ యూబీ ఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమన్నారు.
ఇందుకోసం రెండింటికి రూ.170 కోట్లు మంజూరుకావాలన్నారు. అలాగే నిజామాబాదులోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి పాత జిపి ఆఫీస్ వరకు రూ.30 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్డు కోసం ప్రతిపాదించడం జరిగిందన్నారు. వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయి, భీమ్గల్ మీదుగా కమ్మర్పల్లి వరకు నగరాన్ని కలుపుతూ 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను కూడా అందజేశామన్నారు.
మరొక రోడ్డు నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం, దుబ్బ మీదుగా కాలూర్ రోడ్డు ను పూర్తి చేయాలని కోరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అభయ్ పాటిల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు.
