అటవీ సంరక్షణ పై విద్యార్థులకు అవగాహన సదస్సులు-అగ్ని ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలు-అడవులపై నిరంతరం నిఘానేడు అడవులను రక్షించుకుంటేనే రేపటి తరానికి, సకల జీవకోటికి ఆరోగ్యకరమైన పర్యావరణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నుంచి అడవులను రక్షించుకోవాలని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం చందూర్ విక్టరీ స్కూలు లో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ రాజు మాట్లాడుతూ..అటవీ ప్రాంతాలకు పశువులను తీసుకొని వెళ్లిన పశువుల కాపరులు, తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలు, వంట చెరుకు కోసం వెళ్లే రైతులు బీడీలు, చుట్టలు తాగి పడేస్తే మంటలు అంటుకొని పెద్దమొత్తంలో అడవులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
దీంతో చెట్లు కాలిపోవడంతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న వణ్యప్రాణులకు సైతం ముప్పు వాటిల్లుతుంది. అందుకు మనం అందరం కలిసి వన సంపదను కాపాడుకోవాలని ఆయన తెలిపారు.అలాగే భూగోళమనే శరీరానికి అడవులే ఊపిరితిత్తులు.
అవి వాయు కాలుష్యాన్ని నివారించి జీవరాశికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందిస్తాయి. అత్యంత విలువైన, ఎన్నటికీ తరిగిపోని సహజ సంపదను అందరూ కాపాడుకోవాలనీ సూచించారు. వనాలు క్షీణించే కొద్దీ కాలుష్యం, భూతాపం పెరిగిపోతాయి. వర్షాలు గతి తప్పుతాయి.
దాంతో ఆహార సంక్షోభం సంభవిస్తుంది. అలాంటి సమస్యల నిరోధానికి, భవిష్యత్తు తరాల సంక్షేమానికి అడవులను రక్షించుకోవడం చాలా అవసరమని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అందుకే మన దేశంలో అడవుల స్థితిగతులు, వాటిలో రకాలు, సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టారు.
ప్రభుత్వం తో పాటు అందరం కలిసి అటవీని సంరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ బీట్ ఆఫీసర్లు షబ్బీర్, వినోద్ కుమార్, సునీత, శివ, విటల్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
