తొలి రోజే వెల్లువెత్తిన దరఖాస్తులునిజామాబాద్ పురపాలక ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇన్నాళ్లూ రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన రాజకీయ పార్టీలు, ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వేగాన్ని పెంచాయి.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే.. ఆశావహులు జెండాలు చేబూని రంగంలోకి దిగారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల కార్యాలయాలు కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోయాయి.
రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. తమ గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్న ఆశావహులు.. తొలిరోజే దరఖాస్తులతో కాంగ్రెస్ భవన్ కార్యాలయం వైపు కదిలారు. సోమవారం వరకు సుమారు 400 దరఖాస్తులు అందాయంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతి డివిజన్ నుంచి ఐదుగురు కంటే తక్కువ కాకుండా దరఖాస్తులు వస్తుండటంతో టికెట్ల కేటాయింపు పార్టీ నాయకత్వానికి సవాలుగా మారనుంది.
బీజేపీ శిబిరంలో హడావుడి
నగరంలో బలమైన పట్టున్న భారతీయ జనతా పార్టీ సైతం ఎన్నికల క్షేత్రంలో పావులు కదుపుతోంది. రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన వెంటనే ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
ముఖ్యంగా యువత, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఈసారి భారీగా పోటీ పడుతున్నారు. మేయర్ పీఠం జనరల్ (మహిళ) కావడంతో, కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రిజర్వేషన్ల మార్పుతో పలువురు సీనియర్ల లెక్కలు తారుమారయ్యాయి. దశాబ్దాలుగా ఏలుతున్న డివిజన్లు రిజర్వ్ కావడంతో, ఇతర డివిజన్ల నుంచి పోటీకి సై అంటున్నారు. 60 డివిజన్లలో సగానికి పైగా మహిళలకు కేటాయించడంతో ఈసారి కౌన్సిల్ హాల్‌లో మహిళా ప్రాతినిధ్యం భారీగా ఉండనుంది.
అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తామని పార్టీలు చెబుతుండటంతో ఆశావహులు పైస్థాయి నాయకుల వద్ద పైరవీలు మొదలుపెట్టారు.
నిన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న నగర వీధులు.. నేడు ఎన్నికల ప్రచారపు కోలాహలానికి సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తయితే ఇందూరు గడ్డపై అసలైన సమరం మొదలుకానుంది.
