అద్విత సేవా గుణాన్ని అభినందించిన సీపీ సాయి చైతన్య..ఆటపాటలతో గడపాల్సిన ఆ చిన్నారి మనసు సేవాపథం వైపు మళ్లింది. తన ఊహ తెలిసినప్పటి నుంచి పొదుపు చేసుకున్న నగదును సామాజిక ప్రయోజనాల కోసం వెచ్చిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమంలో అద్విత అనే చిన్నారి తన ఉదారతను చాటుకుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పోలీసులు నిర్వహించిన ఈ పరుగు పందెంలో మహిళా, పురుష విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు అద్విత తన కిట్టి బ్యాంకులో దాచుకున్న డబ్బులతో బహుమతులను అందజేసింది.
చిన్న వయసులోనే సామాజిక స్పృహతో ఆమె చేసిన ఈ పనిని చూసి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చిన్నారి అద్వితను ప్రత్యేకంగా అభినందించారు.
“పిల్లల్లో ఇలాంటి సేవా దృక్పథం ఉండటం అభినందనీయం. గతంలోనూ తన పుట్టినరోజు సందర్భంగా సుమారు 60 హెల్మెట్లు పంపిణీ చేసి ప్రాణ రక్షణపై అవగాహన కల్పించడం గొప్ప విషయం” అని సీపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ యాదవ్, రూరల్ సీఐ, ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
