ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠా గుట్టు రట్టయింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అండదండలతో సాగిన ఈ దందాలో బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గొట్టే స్వరూప అనే మహిళ నిజామాబాద్‌లోని గంగస్థాన్ ప్రాంతంలో నివాసముంటోందనీ అన్నారు. నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కుబేర్ రెడ్డి తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
వీరిద్దరూ కలిసి నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్అండ్‌బీ, జిల్లా పరిషత్, ఎస్సీ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారనీ తెలిపారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేశారు.
నమ్మకం కలిగించేందుకు ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ నియామక పత్రాలు ఐడీ కార్డులను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. తాము పొందిన నియామక పత్రాలు నకిలీవని ఆలస్యంగా గుర్తించిన బాధితులు లబోదిబోమంటున్నారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేరుడిని నమ్మే తాము డబ్బులు ఇచ్చామని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, తనకు ఆ డబ్బుతో సంబంధం లేదని, ఎవరికి ఇచ్చారో వారినే అడగాలంటూ సదరు కానిస్టేబుల్ బాధితులపైనే ఎదురుదాడికి దిగడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నిజామాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు నమోదయ్యాయి.
మూడో పట్టణ పోలీస్ స్టేషన్: నలుగురు బాధితుల ఫిర్యాదు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్: ముగ్గురు బాధితుల ఫిర్యాదు. రూరల్ పోలీస్ స్టేషన్: ఒక ఫిర్యాదు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు గొట్టే స్వరూపతో పాటు ఆమెకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ కుబేరుడిపై కేసులు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఉదంతంలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రధాన నిందితురాలి వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా నిఘా పెట్టారు.
