విద్యార్థులకు రాజకీయాలపై అవగాహన ఉండడం అత్యంత అవసరమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి బానోత్ రఘురాం అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై యువత అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగిన సంపూర్ణ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
ఏఐఎస్ఎఫ్ నినాదమైన “చదువు పోరాడు”స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ, లౌకిక, ప్రజాస్వామ్య విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం చదువు మాత్రమే కాకుండా, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం విద్యను కాషాయీకరించే లక్ష్యంతోనే రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారని రఘురాం తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రమాదకర విధానాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు విద్యార్థులందరూ విస్మరించకుండా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
దేశ భవిష్యత్తు పూర్తిగా యువత, విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఆయన ఉద్ఘాటించారు. విద్యార్థులు నిత్య జీవితంలో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
సమాజంలో ప్రశ్నించే స్వభావం కనుమరుగైతే ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిని, దేశం కొద్దిమంది స్వార్థ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కిషోర్, నీరజ్, భాను, రాహుల్, సన్నీ తదితరులు పాల్గొని విద్యార్థులను పెద్దఎత్తున సంఘంలోకి ఆహ్వానించారు.
