కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గణేష్ బిగాల ఆగ్రహంఐడీవోసీ ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాబీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులతో భౌతిక దాడులు చేయించడం హేయమైన చర్య అని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ ఐడీవోసీ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ..ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును కోరుతూ నల్ల టీషర్టులు ధరించి శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు.
నర్సాపూర్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను కిందపడేసి, తొక్కి గాయపరిచారని ఆరోపించారు.
మహిళా ప్రజాప్రతినిధిపై, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
పాలన చేతకాకపోతే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గద్దె దిగాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, నిరంకుశ పాలన కొనసాగిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.
