ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నేతృత్వంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫూలాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు వెయ్యి రోజులు పూర్తయినా ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. హామీల అమలుపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశామని తెలిపారు.
‘అయ్యా.. మీరైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడండి’ అంటూ అంబేద్కర్‌ను వేడుకున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
