విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసు కుటుంబాల్లో బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. పేట్లబురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్క్వార్టర్స్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ దంపతులు పాల్గొని మహిళా అధికారులు, సిబ్బందితో కలిసి సందడి చేశారు.
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన పోలీసు కుటుంబాలతో సీఏఆర్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. గౌరమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం మహిళా సిబ్బందితో కలిసి సీపీ దంపతులు బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆడిపాడారు.
చప్పట్లు, కోలాటాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. విధి ఒత్తిళ్ల మధ్య పనిచేసే పోలీసు సిబ్బందికి ఈ వేడుక ఆహ్లాదాన్ని పంచింది.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే పోలీసు కుటుంబాలన్నీ ఒకచోట చేరి పండుగను జరుపుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రకృతి మాత ఆశీస్సులతో మహిళలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్క్వార్టర్స్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు, జోనల్ డీసీపీలు కిరణ్ ఖారే, రక్షిత కృష్ణమూర్తి, శిల్పావల్లి, లావణ్య నాయక్, వెంకటలక్ష్మితో పాటు ఇతర పోలీసు అధికారులు, మహిళా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
